ఆకుపచ్చ యాత్ర

అడవి.. ఎప్పటికీ అర్ధంకాని ఒక రహస్యం. కవ్వించే సౌందర్యం. భయపెట్టే బీభత్సం. సేద దీర్చే సహచరి. ఆప్యాయంగా అక్కున చేర్చుకునే అమ్మ.tirumala trek (68)
తిరుమల కొండను ముట్టడిస్తున్నట్టుగా పరచుకున్న పచ్చని అడివి మోహంలో పడి తిరుపతికి బందీలయిపోయిన ఎందరిలో నేనూ ఒకణ్ణి. మేక పిల్లను మింగి కదల్లేక పడుకున్న కొండచిలువలా కనిపించే ఈ కొండ, ఏ కాలానికా అందాన్ని ప్రదర్శిస్తుంది. ఒక్క పూట నిలబెట్టి కురిసిన వానకి, జలజలా దూకుతాయి జలపాతాలు. తిరుపతి ఏ మూల నుంచి చూసినా నల్లపచ్చనికొండ నిండా తెల్లటి పాయలు కనిపిస్తాయి. కొండకు దగ్గరగా ఇళ్ళుండేవాళ్ళకు వానకాలమంతా జలగలల సంగీతం ఒక వరం. మంచు కురిసే వేళ.. పసుపు, ఎరుపు పూల పచ్చనాకుల అడవి చెట్లతో, పొగ మబ్బుల గుసగుసలు, మసక వెలుగులో  మార్మిక సౌందర్యం. భగ్గున మండే  ఎండలకాలంలో, ఆకులన్నీ రాలిపోయి, కొమ్మలన్నీ కాలిపోయి ఎర్ర మచ్చల బెదురు చూపుల జింక పిల్లలా ఉంటుంది తిరుమల కొండ. పచ్చదనాల మధ్య  పొరలు పొరలుగా కనిపించే ఎర్ర బండలు.. దూరపు చూపులకే కట్టిపడేసే తిరుమల కొండ లోలోపలికినడిచి, గుట్టలెక్కి, లోయలుదిగి, వంకలు దాటి, రాయి రప్పలు ఒరుసుకుంటూ ప్రయాణిస్తే…
 కొండల్లోని కోనలూ, కోనల్లో పరుగులు తీసే వాగులూ, కొండ అంచుల్లోని లోయలూ, లోయ లోతుల్లోంచి పిలిచే చీకట్లూ, చీకటి కమ్మిన చెట్లను చీల్చుకుంటూ నేలను తాకే వెలుగు కిరణాలూ, లేత కాంతిలో మెరిసే చిగుళ్ళూ, ఎండినాకుల మీద చినుకుల టపటపలూ, పేరు తెలీని పిట్టల రెక్కల రెపరెపలూ,  ఎర్రమట్టి పుట్టలూ, విరబూసిన ముళ్ల పొదలూ,  పెనవేసుకుని ఎగబాకిన తీగలూ, ఎన్నెన్నో కాయలూ.. అరుదుగా దొరికే అదృష్టం ఇది. అడవిలో, చెట్లలో, పూలలో, పిట్టల్లో, రాళ్ళలో, వంకలు వాగుల్లో, గడ్డి పొదల్లో కలగలిసిపోయి తిరుగులాడే అవకాశం..ఓహ్‌..!
తిరుపతి యూత్‌ హాస్టల్‌ ఏర్పాటు చేసిన ప్రయాణం. లీడర్‌ బాలు. పిల్లా పాపలతో కలిసి పాతిక మంది. రెండు రోజులు అడవి జీవనం. కడప జిల్లా కుక్కలదొడ్డి నుంచీ తెల్లవారే వేళ అడవిలోకి అడుగు పెట్టాలని ముందుగా అనుకున్న నిర్ణయం. ఎర్రచందనం చెట్లు తెగ నరికి తరలించే ముఠాలు అడవిలోకి ప్రవేశించే దారీ, వేళా అదే. ఎందుకొచ్చిన తంటా అని,  కొండకి రెండో పక్క నుంచీ నడుద్దాం అని చెప్పారు. ముందు రాత్రి నుంచీ ఎడతెగని వాన. చలి. ప్రయాణం బహుశా సాగదేమో అనుకున్నాం. నవంబరు నెలలో తుపాను రోజుల్లో తిరుమల కొండల్లోకా..? హఠాత్తుగా విరుచుకుపడి పారే వాగులు, వానకి మట్టి కరిగి జారే బండలు, లోయ అంచుల్లో వేళ్ళతో సహా కూలిపోయే వృక్షాలు, నాని జారే రాళ్లు. ప్రయాణం వాయిదా పడుతుందనే నమ్మకం, పడాలనే ఆశ. తెల్లారినా వెలుగు జాడలేని ఆకాశాన్ని చూస్తే  తెలియని భయం. వాయిదా అనే మాట వినబడుతుందని ఫోన్‌ చేస్తే, ముందు పాపనాశనం చేరుకుందాం పదండి అన్నారు.  మమ్మల్ని సన్నద్ధం చేసింది విష్ణు బ్యాంకు సహోద్యోగి భవాని. పిల్లలూ, భర్తతో పాటూ హైదరాబాద్‌, చెన్నయ్‌, కొత్తగూడెంల నుంచి బంధువుల్ని, చిన్ననాటి స్నేహితుల్ని కూడా పోగేసింది ఆమె. ఉదయపు నడకకే మొరాయించే రాగలీనతో కలిసి రెండు రోజులు నడక సాగేదేనా అనే సందేహం. పైగా ఇంత వానలో? చూద్దాం అని, బూట్ల లేసులు బిగించి, రెయిన్‌ కోట్‌లు తొడుక్కుని, తలకి టోపీలు పెట్టుకుని పాపనాశనం చేరుకున్నాం. ఉదయం తొమ్మిదిన్నర. ఆగని వాన. పొగ మబ్బు. చిమ్మ చీకటి. అపనమ్మకంగానే ఒక్కరొక్కరూ బస్సులు దిగారు. అప్పటికే నెట్‌లో వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ చూసి, ఉరుములూ, మెరుపులూ, ఈదురు గాలులూ ఉంటాయని తెలుసుకుని,  ‘ఆగిపోదామా’ అనడిగాం బాలూ బృందం రాగానే. తేలిగ్గా నవ్వి, ‘వానలో తడుస్తూ ప్రయాణం కూడా ఒక అనుభవమే పదండి నడుద్దాం’ అన్నాడు. ఆశగా అందరూ భవాని వైపు చూశారు. లేక్కలేనట్లే ఉందామె. ‘ఏం ప్రమాదం లేదా?’ అనడిగారు కొందరు బాలూని బేలగా. ‘ఉంటుంది, అయినా బావుంటుంది.’ అని, మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కట్టించుకుని వచ్చిన ఇడ్లీ పొట్లాలు తలా ఒకటి ఇచ్చాడు. ఆ అరగంటలో ఎన్నో అనుమానాలు, భయాలు. వెనక్కా, ముందుకా తేల్చుకోలేని సంకోచం. తిరుమలలోనే కొందరు ఆగిపోయారు. మేం కదిలాం లోపల బెరుగ్గానే ఉన్నా, బయటకి బింకంగా. పాపనాశనం డ్యాం మీద ఉదయం పదిగంటల వేళ.. పదడుగుల ముందేముందో కూడా కనిపించడంలేదు. మొండిగా నడిచాం ముందుకే. ఎత్తయిన గుట్ట.. కాళ్ళ కింద జర్ను జారుతున్న మట్టి. ఒగర్చుకుంటూ నిదానంగా పైకి చేరుకున్నాం. వాన కాస్త తెరపిచ్చింది. ‘ఇంకెక్కడా గుట్టలెక్కే పని ఇంత ఉండదు’ అని ఉత్సాహపరిచాడు బాలు. అర గంట నడక, తడిచిన పొదల నడుమ సన్నని కాలి దారి. గలగలా శబ్దం స్వాగతం పలికింది. రెండు పాయలుగా వచ్చిన వాగు ఒకటిగా కలిసి పారుతోంది. అక్కడే చిన్న  పందిరి కింద  హనుమంతుడి రాతి విగ్రహం. మట్టి ప్రమిదలో ఆరిపోయిన దీపం. ‘సనకసనంద తీర్ధం. మళయాల స్వామి ఇక్కడే ధ్యానం చేసేవారంట. తర్వాత ఆయన ఏర్పేడులో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని స్ధిరపడ్డారు’ అంటూ దాని గురించి చెప్పాడు బాలు. అందరినీ అక్కడ పోగేసి, ట్రెక్కింగ్‌ నియమాలన్నీ వివరించాడు, ‘మద్యం, పొగ నిషేధం. మనిషి వాసన జంతువుల్ని చికాకు పరుస్తుంది. చిరుతలుండే అడవి ఇది, కొండ దిగితే ఏనుగుల గుంపు ఉంటుంది. మన ప్రవర్తన వాటిని రెచ్చ గొట్టకూడదు. ఒకరికొకరు కనిపిస్తూనే నడవాలి’ అని. రెండు రోజులు సెల్‌ఫోన్‌లు మోగవు. వాన మళ్ళీ మొదలైంది. కాసేపు జోరుగా కురిసి, చిటపట మంటూ సర్దుకుంది. తడుస్తూ, ఆరుతూ, కళ్ళద్దాల మీద చినుకులు తుడుచుకుంటూ, తడి ఆకుల స్పర్శకు పులకిస్తూ, జారే బండల మీద మునివేళ్ళు అదిమి పట్టిన బూటుకాళ్ళతో నడుస్తూ లోయ అంచున మూడు గంటల ప్రయాణం. నడి మధ్యాహ్నపు వేళ కూడా వెలుగు జాడలు లేవు. తెరిపి లేని వాన మబ్బు కమ్మిని ఆకాశం కింద ఏదో సంతోషం, తెలియని దిగులు..ఇంకెంత దూరం? వాన కురిసే రాత్రి ఈ అడవిలో బస ఎట్లా? సందేహాలు లోపల్లోపలే అదిమి పెట్టేసుకుని భారం భవానీ మీదా, బాలూ మీదా వేసేసి నడుస్తున్నారు అందరూ. మా బృందానికి సాయం కోసం ఆ అడవంచు పల్లెల్లోని యానాదులు పది మంది వంట పాత్రలూ, సామాగ్రి మోసుకుంటూ మా కన్నా ముందు నడిచారు. అడవి ఆనుపానులు తెలిసినవారు వీరే.tirumala trek (106) చిరుత లు తిరుగాడే చోట్లు, లేళ్ళ మందలుండే ప్రాంతాలు, ఎలుంగొడ్ల గుహలు, ఏనుగుల అడుగుజాడలు, రేసుకుక్కలతో ప్రమాదాలు, నక్కలు నక్కి ఉండే బొరియలు, విషపు పాములు, రాళ్ళ కింద తేళ్లు..అడవిని చదువుకున్న జ్ఙానులు వీరు. ఈశ్వరయ్య, అంకయ్య, సుబ్బరాయుడు, ఎంగటేశ్వర్లు.. ఎక్కువ మందికి ఇవే పేర్లు. పెద్దగా ఎవ్వరితో మాట్లాడరు.  వీరు చూపిన దారిలోనే రెండు రోజులూ నడిచాం. ఆగమన్న చోట ఆగాం. పడుకోమన్న చోట పడుకున్నాం. పెట్టింది తిన్నాం. వీరితో పాటూ వంట మాస్టారు రఘు తిరుపతి నుంచి వచ్చాడు. పాతికేళ్ళుగా ఆయన ఈ కొండ కోనల్ని ఎక్కి దిగుతూనే ఉన్నాడంట. పెళ్ళిళ్లు, ఇతర కార్యాలున్నా అడివిలో వంట అంటే చాలు అన్నీ వదిలేసి వచ్చేస్తాడంట. అడవంటే అంత మోజు రఘుకి.
మాకన్నా ముందు నడిచెళ్ళిపోయి, ఒక కాలువ పక్కన, కొండ అంచున ప్లాస్టిక్‌ పట్ట వాలుగా కట్టి దాని కింద  రాళ్ళ పొయ్యిలు వెలిగించారు మా సహాయకులు. రెండు గుహలున్నాయి అక్కడ. గుహల్లో బ్యాగులు తడవకుండా దాచుకున్నాం. ‘ఈ రాత్రి ఇక్కడే ఉంటాం’ అన్నాడు బాలు. ‘ఇక్కడా..’ అని అందరూ అరిచారు చుట్టూ చూస్తూ. ఒక చోట వాలుగా నీలం పట్ట వేలాడగట్టారు. ‘మీరు తెచ్చుకున్న పట్టలు నేల మీద వేసుకుని పడుకోవాలి’ అన్నాడతను. వాన కురుస్తూనే ఉంది. ఇంతలో పొగలు కక్కే టీ .  టీ తాగే అలవాటు లేని వాళ్ళు కూడా అందుకున్నారు. ఎవరికి వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళ బాటిళ్ళు ఖాళీ. కొండ మీద నుంచి కారుతున్న నీళ్ళని పట్టుకున్నాం తాగడానికి. బ్యాగులన్నీ పెట్టేశాక, తుంబురు తీర్ధానికి గంట నడక. బండరాళ్ళ మధ్య నుంచి వడిగా పారుతున్న వాగులోంచీ, వాగు అంచుమీద నుంచీ, పాచిపట్టి జారుతున్న బండల మీదుగా ప్రయాణం.. ఇటు నుంచి అటూ, అటు నుంచి ఇటూ వాగుని దాటుకుంటూ జిల్లుమనే నీళ్ళలో నానుతూ. ప్రవాహం వేగంగా ఉన్న చోటంతా మోకులు పట్టుకుని ఒకరి వెనుక ఒకరు వాగు దాటారు. మా సహాయకులు దడి కట్టి నిలబడి, వాగు వేగానికి కొట్టుకుపోకుండా ఒక్కొక్కరినీ పట్టుకుని దాటించారు. చాలా చోట్ల  వాగు ప్రవాహ వేగానికి కాళ్ళు ఆనేవి కావు. ఎంతో ఒడుపుగా, భద్రంగా ఒడ్డుకు చేర్చారు మమ్మల్ని. రెండు కొండల మధ్య లోయలో ఒంపులు తిరుగుతూ వయ్యారాలు పోతూ, తుళ్ళుతూ దూకుతూ, నురగలు పరుగులుగా పారే ఆ వాగు  ఆ రెండు రోజులూ మా వెంటే ఉంది, మమ్మల్ని భయపెడుతూ, మాకు ధైర్యం చెబుతూ. గంట తర్వాత- నిటారుగా, ఆకాశంలోకి నిలబెట్టిన నిచ్చెన్ల లాగా రెండు కొండలు ఒకదాని కెదురుగా ఒకటి, ఇక ఆలింగనం చేసుకోబోతాయా అన్నంత దగ్గరగా  కనిపించాయి. దట్టంగా చీకటి పరుచుకున్న లోయ అది. ఆ రెండు కొండల వెనుక నుంచి దిగ్గున వెలుగు పడుతోంది. బహుశా అవతలి పక్కన విశాలంగా ఉండిఉండాలి. రమ్మని పిలుస్తున్నట్టుగా ఉన్న ఆ వెలుగు దగ్గరికి చేరుకోవాలంటే నీటి మడుగులోంచి వెళ్ళాలి. ‘చాలా లోతు, వెళ్ళలేం’ అన్నారు. ‘ ఈత వచ్చిన వాళ్ళం అయినా వెళ్ళచ్చుగా’ అనడిగితే, బాలు ఒప్పుకోలేదు. అప్పటిదాకా వానలో, వాగులో తడుస్తూనే ఉన్నా, అందరూ మడుగులో స్నానాలకు దిగారు. చల్లటి నీళ్ళలోనే కేరింతలు, అరుపులు, కేకలు, ఆటలు,ఫోటోలు. అలిసిపోయి మళ్ళీ వెనక్కి మోకులు పట్టుకుని వాగు దాటుకుంటూ  నడక. బస చేసిన చోటుకు చేరుకుని కూల బడ్డారు బండల మీద. బూట్ల లోంచి బయటకు తీసిన పాదాలు జవికి పోయి ఉన్నాయి. త డిచిన గుడ్డటూ, బూట్లూ పిండి పొడిగా ఉన్న కొండ గుహలో ఆరేసుకుని పట్టలు పరుచుకుని నడుం వాల్చారు. వేడి వేడి పలుచటి సాంబారుతో భోజనం ఆకలి మీద అదిరిపోయింది. ఆవురావురుమంటూ తిన్నారు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. వాన సన్నగా కురుస్తూనే ఉంది. చుట్టూ కొండల నడుమ వాగు ఒడ్డున గుహ అంచున అందరం ఉన్నాం. అగోరీబాబా అనే ఆయన చాలా ఏళ్ళు ఆ గుహలో ఉండే వాడు. ఐదారేళ్ళ కిందట ఎవరో గుహలోనే ఆయనని చంపేశారు. హత్య జరిగిన చోటే మా రాత్రి నిద్ర. గుహలోపల సన్నటి దువ్వ మట్టి, గబ్బిలాల చప్పుడు, మక్కు వాసన. వాన వేళ, తల తడవకుండా ఉంచే ఆ గుహ స్టార్‌ హోటల్‌ని తలపించింది. నీలం పట్ట కింద కొందరు, గుహలో కొందరు . చీకటి దట్టంగా అలుముకుంది. రాత్రి అడవి అరుపులు మొదలయ్యాయి. ఏరుకొచ్చిన కొన్ని దుంగలతో మంట వేశారు. కబుర్ల మధ్య అంతగా ఆకల్లేకపోయినా, పూరీ, ఉల్లగడ్డ కూరతో రాత్రి భోజనం పూర్తయింది. నడిచీ, నానీ ఒళ్ళు పులిసిపోయి, అలిసిపోయినా ఎవ్వరికీ సరిగా నిద్ర లేదు.   ఫోన్‌లకు కూడా అందని లోయలో, నిండు పౌర్ణమి నాడు చిమ్మ చీకట్లో, హోరున పారే వాగొడ్డున, ఏ జంతువు ఏ పొద చాటున నక్కి ఉందోననే భయం వెంటాడుతున్న ఆ  రాత్రి  సన్నని వానా ఆగలేదు, ఎవ్వరి కంటి మీదా రెప్పా వాలలేదు.
అడవి కోళ్ళ అరుపులు, పిట్టల కిలకిలలతో పాటూ సన్నని వెలుగు ఆకాశంలోంచి లోయలోకి దిగుతోంది. ఉదయపు కార్యక్రమాలు ముగిశాయి. చలి ఉదయపు చల్లని వాగు స్నానం, కాసేపు వణికించినా ఎంతో హాయిగా ఉంది. పొంగలి తిని, వెజిటబుల్‌ రైస్‌ ప్యాకె ట్లు  బ్యాగుల్లో సర్దుకుని తుంబురులోయకు వీడ్కోలు చెప్పి రెండో రోజు నడక మొదలు పెట్టాం. మొన దేలిన రాళ్ళ మీద నడక. తడి ఆరని బూట్లలో దూర్చిన నానిన పాదాలు జివ్వుమంటూనే ఉన్నాయి. వాగు ఒంపు తిరిగినపుడంతా మోకులు పట్టుకుని దాటడం, కొన్ని చోట్ల నీళ్ళలోనే ఫర్లాంగులకు ఫర్లాంగులు నడవడం. ముళ్ళ పొదలు, వేలాడే తీగలు, బిక్కి, నేరేడు, నెల్లి, కరక, ముష్టి, అడవి మామిడి చెట్లు. చిత్ర విచిత్రమైన పూలు, పేరు తెలీని కాయలు.. ఎటు చూసినా కొండ నెల్లికాయల గుత్తులు. కొందరు మోయగలిగినన్ని కోసి బ్యాగుల్లో కుక్కుకున్నారు. కొందరు తినగలిగినన్ని జేబుల్లో నింపుకున్నారు. బుగ్గన దాచుకున్న నెల్లికాయ రసాన్ని పంటి గాట్లతో కొంచం కొంచం పీలుస్తూ ఉంటే, నడిచినంత సేపూ అలసటను దూరం చేసింది. దాహమైనపుడు వాగులో తేటంగా పారే నీళ్ళు తాగుతూ, ఒకర్నొకరు హెచ్చరించుకుంటూ, జారి పడుతూ, బెణికిన కాళ్ళను సర్దుకుంటూ మూడు గంటల నడక. పేర్చిన పొరల్లా ఒంగి గొడుగు పట్టినట్టుగా ఉండే కొండ అంచుల కింద నుంచీ, మనిషెత్తు పిచ్చి పొదల్లో దారి చేసుకుంటూ పారే వాగుతో పాటే ప్రయాణం. వీపుల మీద బ్యాగుల భారం. మబ్బులు పలచబారి వెలుతురు ప్రకాశవంతంగా అడవిని ఆవరించింది. వాన దూరమైంది. ఆ లోయలో అప్పుడప్పుడూ చెమటలు కూడా పడుతున్నాయి. మహా వృక్షాలను పెనవేసుకున్న  మెలికల గిల్ల తీగలూ, ముదురుపచ్చని ఆకుల మీద మెరుస్తున్న వెలుగు రేఖలూ, వాగు నీళ్ళలో గోగు పువ్వులవంటి పసుపు పూల గుత్తులూ, తెరిపి ఉన్న చోట ఎగిరే సీతాకోక చిలుకలూ..శ్రమ తెలియని నడక. దట్టమైన వెదురు వనాలకిందకి చేరుకోగానే చీకటి కమ్ముకునేది. వెదురు పొదరింటికి చిల్లు పడిందా అన్నట్టుగా మైదానంలో వెలుగు పరుచుకునేది. అడవి యానాదులు నెత్తిన మోతతోనే మాకు ముందూ, వెనుకా మమ్మల్ని కవర్‌ చేసుకుంటూ నడుస్తున్నారు. కోట గోడలా చుట్టూ ఆవరించిన కొండల నడుమ విశాలమైన గడ్డి మైదానంలో మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి. అక్కడే ప్యాకెట్లలోని భోజనం. పొద్దు వాలక ముందే లోయలోంచి బయటపడాలి. మళ్ళీ నడక. చాలా చోట్ల దారి లేదు. కొన్ని చోట్ల మాత్రం బండ రాళ్ళ మీద ఎర్ర పెయింట్‌తో వేసిన బాణం గురుతులు కనిపించాయి. ఏడాదికోసారి జరిగే తుంబురు తీర్ధం కోసం వచ్చే భక్తులకు దారి చూపేందుకు టీటీడీ వేసిన గురుతులు ఇవి. పొంగి పారుతున్న వాగు నీళ్ళలో అనేక చోట్ల ఇవి మునిగి పోయాయి.అయినా యానాదులకు ఈ దారి కొట్టిన పిండి. నడిచీ నడిచీ ఒక చోట ఈతకు అనువుగా వాగు లోతుగా ఉన్న చోట ఆగాం. గబగబా కొందరు నీళ్ళలోకి దూకేశారు. ఏనుగులు ఈదులాడే వాగు అది. ఇక ఇక్కడి నుంచీ కొండకు దూరమవుతాం. ఏనుగుల రాజ్యం అది. చిత్తూరు జిల్లాలోంచి నడక మొదలు పెట్టి కడప జిల్లాలోకి ప్రవేశించాం. సాయంత్రపు వెలుగులో లేత పసుపు దనం పరచుకున్న గడ్డిమైదానంలోకి అడుగుపెట్టాం. మనుషులు కనిపించనంత ఏపుగా పెరిగిన గడ్డిపొదల మధ్య నుంచీ నడక. కొంత సేపటికి బురద నేల మొదలైంది. దూరంగా రైలు చప్పుడు. నడిచీ నడిచీ రైలు కట్ట దాటి కుక్కలదొడ్డి రోడ్డు మీదకు చేరుకున్నాం. కడప నుంచీ వచ్చే బస్సులు ఆపి ఎక్కి తిరుపతికి తిరుగు ప్రయాణం. తడచీ, ఆరీ, నడచీ, నవ్వీ, పడీ, పరుగెత్తీ, దిగులూ, భయంతో కూడుకున్న సాహసోత్సాహంతో ప్రయాణించి, నిత్యం ఎదుర్కొనే సకల వత్తిళ్ళ నుంచీ ఆ ఆకుపచ్చ లోయలో విముక్తమై అనంతమైన ఆనందాన్ని మనశ్శరీరాల నిండా నింపుకుని అడవి ఒడ్డుకు చేరుకున్నాం.

‘ఎర్ర’ బీభత్సపు ఆనవాళ్ళు
CIMG7665అడవియాత్రలో తొలి నుంచీ చివరి దాకా మా మధ్య మాటలై నడుస్తూ, మమ్మల్ని వెంటాడిన విషయం ఎర్రచందనం స్మగ్లింగ్‌. తిరుమల అడవుల్లో విస్తారంగా పరచుకున్న అరుదైన అద్భుత వృక్షాలు ఇవి. విలువైన సంపద ఇది. అడవినీ అడవిలోని ఎర్ర బంగారు సంపదనీ కొల్లగొడుతున్న తీరు అడుగడుగునా కనిపించింది.  సనకసనంద తీర్ధం దాటిన అరగంట నుంచే ‘ఎర్ర’ బీభత్సం తీవ్రత అర్ధమైంది. నరికేసిన ఎర్ర చందనం చెట్లు అడవి నిండా కనిపించాయి. కొన్ని చోట్ల, ఆ రాత్రో, ఆ ముందు రోజో నరికిన చెట్లూ కనిపించాయి. కొన్ని ప్రదేశాల్లో తరలించడానికి సిద్ధంగా ఉన్న దుంగలున్నాయి. నరికిన చెట్లను ఒక్క చోటకి చేర్చి బెరడు చెక్కి కావలసిన సైజుల్లోకి దుంగలుగా నరుక్కున్న గురుతులున్నాయి. నరికిన దుంగల్ని పారే వాగులోకి దొర్లించి తరలించుకుపోయిన ఆనవాళ్ళున్నాయి. గుంపులు గుంపులుగా ఎర్రచందనం చెట్లు నరికే కూలీలు తిరుమల అడవిలోనే రోజుల తరబడి ఉన్నారనేందుకు సాక్ష్యంగా అనేక చోట్ల భోజనాలు వండుకున్న పొయ్యిలున్నాయి. ఎర్ర దొంగలు వంటకీ,  రాత్రుళ్లు చలి నెగళ్ల మంటకీ కూడా అత్యంత విలువైన ఎర్ర చందనమే వాడుకుంటున్నారనేందుకు గుర్తుగా సగం కాలి ఆరిన దుంగలు కనిపించాయి. ఎర్రటి గురుతులు, బొగ్గులు, ఎర్ర పేళ్ళ పోగులు.. అడుగడుగునా తారసపడ్డాయి. తెగిన వృక్షాల కాండాలు నేలలోంచి పొడుచుకువచ్చి వికృతంగా ఉన్నాయి. పాతికేళ్ళ కన్నా ఎక్కువ వయసున్న ఎర్రచందనం చెట్లు మాత్రమే చేవదేలి ఉంటాయి. వాటికే మార్కెట్‌ ఉంటుంది. వెడల్పాటి కాండమున్న చెట్లనే నరికి తరలిస్తారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ దుర్మార్గం శ్రుతి తప్పి లేత చెట్ల ఉసురూ తీస్తోంది. చిత్తూరు, కడప జిల్లాల్లో అడవి అంచు పల్లెల్లోని వారు కూలీలుగా స్మగ్లర్లకు ఉపయోగపడిన కాలంలో చేవగల చెట్లనే నరికి తరలించేవారు. కేసులు పెరగడంతో స్థానికులు ఎర్ర  వృక్షాలు నరికే పనికి దూరమయ్యారు. దీంతో తమిళనాడు  పల్లెల నుంచి వందలాది మంది కూలీలను రోజుకు వెయ్యి రూపాయల ఆశ చూపి ఈ పనికి పురమాయిస్తున్నారు. ఎర్ర చెట్ల పై అవగాహన లేని తమిళ కూలీలు, లేత చెట్లను కూడా తెగ నరికేస్తున్నారు.  పనికి రావని అక్కడే పారేస్తున్నారు.  ప్రపంచంలో ఇక్కడ మాత్రమే పెరిగే చెట్టు ఇది.  బుడిపెల బుడిపెల బెరడు గలిగిన ఎర్ర చందనం చెట్లు ఒకప్పుడు దట్టంగా శేషాచలమంతా పరుచుకుని ఉండేవి.  ఇప్పుడు శేషాచలం ఎర్రబోడి కొండలుగా మారుతున్నాయి. లక్ష కోట్ల విలువైన ఎర్ర బంగారం ఇప్పటికే అడవి దాటిపోయింది. అటవీ, పోలీసు శాఖ కాస్త గట్టిగా ఉండడంతో తెగించిన ఎర్ర దొంగలు, దుంగల కోసం ప్రాణాలు కూడా తీస్తున్నారు. సౌందర్య భరితమైన ఆకుపచ్చ లోయలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఎర్రదొంగల పుణ్యం వల్ల ఈ కొండల్లోకి నడిచి సేదదీరే ప్రయాణాలకు ప్రజలు దూరమవుతున్నారు. తిరుమల కొండల్లోకి ప్రయాణాలకు ఇప్పుడు అటవీ అనుమతి అంత సులభంగా దొరకడంలేదు. దొరికినా సవాలక్ష ఆంక్షలు. ఎందుకొచ్చిన తంటా అని అడవి దారులు తెలిసిన వారూ దూరంగా ఉండిపోతున్నారు. శేషాచలం కొండల్లో తుంబురు తీర్ధం, కుమారధార, పసుపుధార తీర్ధాలు, శేషతీర్ధం, రామకృష్ణ తీర్ధం, యుద్ధగళ తీర్ధం వంటి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. నడిచి మాత్రమే చేరుకునే ప్రదేశాలు ఇవి. కష్టనష్టాలకోర్చి ప్రయాణిస్తే పొందే ఆనందం అంతా ఇంతా కాదు. అయితే, ఎర్ర బీభత్సాల వల్ల ఈ తీర్ధాలకు ముందుండి నడిపించే వారు కరువయ్యారు. తిరుపతి, కుక్కలదొడ్డి, మామండూరు ప్రాంతాలనుంచి ఎన్నో బృందాలు ట్రెక్కింగ్‌ యాత్రలు నిర్వహించేవి. ఇప్పుడు తిరుపతి యూత్‌ హాస్టల్‌ మాత్రమే అప్పుడొకటీ అప్పుడొకటీ యాత్రలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లో ముందుగా పేర్తు నమోదు చేసుకున్నవారికే అవకాశం ఉంటుంది. అసలు అటవీ శాఖే ఎకో టూరిజం పేరుతో అడవి ప్రయాణాలు నిర్వహించవచ్చు. ప్రయాణించేవారి మంచి చెడ్డలు విచారించుకున్నాకే అడవిలోకి అనుమతించవచ్చు. వీరికి సహకరించేందుకు తిరుపతి చుట్టుపక్కల ఎందరో అడవి గుట్టు మట్లు తెలిసినవారున్నారు. వీరి సేవలు వినియోగించుకోవచ్చు. వీరికి ఉపాధిగానూ ఉంటుంది. అటవీశాఖకు ఆదాయమూ లభిస్తుంది. ఈ కదలికల వల్ల అడవిలో ఎర్ర దొంగల సంచారమూ తగ్గుతుంది.

(ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రికలో అచ్చయిన వ్యాసం)

Posted in వ్యాసం | 1 వ్యాఖ్య

మా ఊళ్ళో పండగ

మా ఊరంటే ఎంత ఇష్టమో, పండగలన్నా అంతే ఇష్టం నాకు. ఉద్యోగంలో ఎంత వత్తిడి ఉన్నా, సర్దుబాటు చేసుకునో, ఎగ్గొట్టో ప్రతి పండక్కీ ఊరికి పరిగెత్తుతూ ఉంటాను. మరీ సంక్రాంతి రోజుల్లో ఊళ్లో గడపడం..గొప్ప హాయినీ, శక్తినీ యిస్తుంది.
అయితే, మూడేళ్ళుగా పండగలు గాయాలే మిగిల్చాయి. ప్రతి గాయాన్నీ బింకంగా సవాల్ చేయడానికే ప్రయత్నించాను. ఊరంటే భయం వేసినా, పండగ పండగకీ ఊరి బాటే పట్టాను. పొయినేడు ఉప్పెనని రెప్ప దాటనివ్వకుండా గలగలా గడపడానికే ప్రయత్నించాను. ఏం జరగలేదన్నట్టుగా, ఎప్పటిలాగే ఆనందంగా ఉన్నట్టుగా పండగ దినాలను గడిపాను. నిప్పట్లు, లడ్లు, మురుకులు..అమ్మా అక్కా చేసే ప్రతి పనినీ ఫోటోలు పట్టాను. చిన్న పెంకుటిల్లు, వెనక విశాలమైన స్థలం. ఎర్రదాసాని, పసుపు ఎరుపు కనకాంబరాలు, అరటి చెట్లు, నిటారుగా ఎదిగిన టేకు చెట్లు, టెంకాయ చెట్లను ముట్టడించినట్టుగా అల్లుకున్న మనీప్లాంట్ వేసిన అరిటాకంత ఆకులు, విరగ్గాసిన కిచ్చిలి చెట్టు, తొంగి చూసే సీతాఫలాలు, పిందైనా పడని సపోటా, ఎన్నేళ్లు గడిచినా పూత కూడా రాని కొండ ఉసిరి, ఆకుపచ్చని వింజామరలతో గాలి తోలే వేప చెట్లు, నేనేం తక్కువా అన్నట్టుండే పడి మొలిచి ఎదిగిన నేరేడు, భద్రాక్షలు, పసుపు పూల గుత్తులు, కోతులు మిగిల్చిన జామ పిందెలు, సగం పండి రెచ్చగొట్టే బొప్పాయి, ఇంటి పక్కన పిచ్చి మొక్కల మీద అల్లుకున్న గుమ్మడి.. ఇన్ని అందాల నడుమ ఇంట్లో వాళ్ళ సందడి. విరిగిన వైరు మంచాన్ని సరిచేసే రంగమామ, నీళ్ళ గుండం పెట్టిన రాళ్ళ పొయ్యి ముందు ఊదర గొట్టం ఊదుతూ విష్ణు, మంచం మీద మాగన్నుగా బాచన్న, ఆటల్లో బంగారు, హంసి, పండు, మనూ. కూరగాయలు తరుగుతూనో, చేపలు తోముతూనో, రొయ్యలు వలుస్తూనో అమ్మ, ఇరుకు వంటగదిలో గజమ్మ, సాయం చేస్తూ రాధ, హైదరాబాద్ నుంచి దిగిందే దీనికోసమే అన్నట్టుగా క్రికెట్ బ్యాట్లు పట్టుకుని పక్కింటి శీనుతో సహా చెక్కేసే నాని, గిరీష్, సన్నీ. అడపా దడపా గిన్నెలు కడుగుతూ నేనూ పని చేస్తున్నాననిపించే బిందు, అమ్మలుండగా మాకేం పని.. అంటూ పరచిన బండ మీద కూర్చుని కబుర్లాడుకునే శిల్పా, స్రవంతీ, కీర్తీ. పిల్లల్తో ఆటలాడుతూ, అటూ ఇటూ తిరుగుతూ రాజశేఖర్…వాహ్ పండగంటే ఇదే కదా! ప్రతి పండగా ఇంతే, పనులూ, వంటలూ, పద్ధతులూ ఇవే. కానీ ఏదో వెలితి. బాబన్న లేని లోటునీ, రాజ్యం వదిన వెళ్ళిపోయిన దుఖాన్నీ ఎవరికి వారు దాచుకుంటూ ఎవరి నటనలో వారు బాగానే జీవించారు. పొగ చూరిన వంటగదిలో జారిపోతున్న కన్నీళ్లు కొంగుతో తుడుచుకుంటూ గజమ్మ అన్ని పండగల్లాగే అన్నా వదినల్లేని ఈ పండక్కీ అన్నీ వండి వడ్డించింది. ఎప్పటిలాగే బోగి ఉదయం రామన్న చేత నూనె రాయించుకుని బాచన్నా, నేనూ, సన్నీ తలకలు పోసుకున్నాం. రంగు రంగుల చీరలు సింగారించుకుని ఆడ పిల్లలంతా సీతాకోక చిలుకల్లా బావి గట్టు దగ్గర ఫోటోలకి ఫోజులిచ్చారు. సంక్రాంతి సాయంత్రం, నిప్పట్లూ, మురుకులతో నేలపట్టు ప్రయాణం. ఇంత పండగనీ ఫోటోలుగా పట్టి దాచుకున్నా, ఎందుకో వీటిని కంప్యూటర్ దాటించ బుద్ధి కాలేదు. ఫేస్ బుక్ లో పంచుకుందామనిపించిన ప్రతి సారీ తెలియని దిగులు వెంటాడేది.
ఏడాది గడిచి పోయింది. మళ్ళీ పండగొచ్చింది. ఏదో భయం తొంగి చూస్తూనే ఉంది. ఈ సారి పండక్కి పోలూరు వెళ్ళనేకూడదని పదే పదే నాకు నేనే చెప్పుకుంటూ వచ్చాను. పండక్కి ముందే రవిమామా విజయక్కా తిరుపతికి వచ్చి పిలిచారు పండక్కి ఊరికి రండీ అని. ఆ మాట తోనే, ఏడాది దాచుకున్న కన్నీళ్ళు కట్టలు తెంచుకున్నాయి. దిగమింగుకున్నాను. వెళ్ళడమా, మానడమా.. సంకోచం. పండగ చేసుకోక పోయినా పరవాలేదు అందరం ఎప్పటిలాగే ఒక్క దగ్గరే ఉందాం అంటూ గజమ్మ ఫోన్ లు , ఎప్పుడొస్తున్నారంటూ బాచన్న పిలుపు. రావడంలేదని చెప్పలేం, వస్తామనీ అనలేం. ఊళ్ళో స్మశానాన్ని బాగు చేసే పనిని భుజాన వేసుకున్నందున, ఈ పని కోసం పండక్కి రెండు రోజుల ముందు ఊరెళ్ళాల్సి వచ్చింది. నాతో పాటే, పాపా, విష్ణూ. అందరికీ ఊరంటే ప్రాణమే. నాలుగు రోజులకి సరిపోయే గుడ్డలన్నీ సర్దేసుకుని, కారేసుకుని కాళాస్త్రి దాటి, బుచ్చినాయుడు కండ్రిగలో ఊరి మలుపు తిరిగి, అంతరిస్తున్న చిట్టడివిలోంచి ప్రయాణం.
అమ్మ లేని పండగ. ఎన్ని దుఖాల్ని దిగమింగిన ధైర్యం ఇది! ఎంత బండబారిన హృదయం ఇది! అమ్మ నుంచి పారిపోతూ, దొరికిపోతూ .. అందరిలో దాక్కుంటూ నాల్రోజులూ గడిచిపొయ్యాయి. ప్రతి పండక్కీ, ప్రతి పనినీ ఫోటో పట్టేందుకు కెమెరాతో సిద్ధమయ్యే నేను. కెమెరాను బ్యాగులోంచి తొలి రోజంతా బయటకే తీయలేదు. పిల్లల్నీ, పిట్టల్నీ, పనుల్నీ ఫోటోలే తియ్యలేదు. బహుశా తియ్యలేకపోయాను. ఉదయపు నడక ఒక్కటే ఈ పండక్కి కాస్తంత సేద తీర్చినది. సూళ్లూరుపేట దారిలోంచి పొలాల్లోకి మట్టి బాట. బాబునాయుడు తోట, నెల్లూరు రెడ్డి తోట. రియల్ వెంచర్లుగా మారిన పొలాలు, ఇనుప ముళ్ళ కంచెలు, గుర్తులకోసం నాటిన రాళ్లు. ఊరు మారిపోతోంది. దిగులు పడి ఏం లాభం? ఏ మార్పుని ఎవరాపగలరు? కెమెరా పీకుతూనే ఉంది. సంతోషం మాయమైన పండగ దృశ్యాలు తీయాలనిపించడంలేదు. రెండో రోజు ఉదయపు నడకలో కెమెరా జేబులోకి చేరింది. ఇల్లు దాటాక లెన్స్ కన్ను తెరిచింది. పురుగూ పుట్రా, ఆకూ అలమూ, పైరు మీద కురిసిన మంచు వానా, గుత్తులుగా అంటిత్తులూ, నేల మీద పల్లేరు పువ్వు , గిలక్కాయలూ, బుడంకాయలూ. సాలె గూళ్లూ..ఇట్లా ఏవేవో ఫోటోలకెక్కాయి. ఇంటికొచ్చాక హైదరాబాద్ నుంచీ శిల్ప ఫోన్..’ బాబాయ్.. ఎవ్వరి ఫోటోలూ తియ్యద్దు. వాళ్ళు ఫేస్ బుక్ లో పెట్టేస్తారు. నేను లేని పండగ. నాకు దిగులేస్తుంది’ అని. నిజంగానే ఎవ్వరి ఫోటోలూ తియ్యలేదు. ఒట్టి పిచ్చి పిచ్చి పువ్వులూ, పురుగులూ తప్ప. అయినా, నా పిచ్చి గానీ వీటిల్లో మాత్రం పండగ లేదా ఏం!

Posted in వ్యాసం | వ్యాఖ్యానించండి

అమ్మా, నీ కథ చెప్పవూ?

amma_akbar
నులకమంచం దిగకముందే
పేడ కళ్ళాపి కమ్మని అమ్మ వాసన
గొడ్ల కొట్టంలో కసువూడ్చే టెంకాయపొరక
బరబర శబ్ద సంగీతం
తొలి ఎండపొడకి
కిలకిల మెరిసే ఎర్రదాసాని పువ్వందం
పందిటి గుంజకి పాకిన కాకర తీగ
విరగబూసిన కనకాంబరాలు,
కిచ్చిలికాయలు, సీతాఫలాల గుత్తులు..
అన్నీ అమ్మ గుర్తులే, అమ్మ పెంచిన బిడ్డలే!

పెళ్లు వాకిట రాళ్ల పొయ్యికి ఊపిరి పోసే ఊదరగొట్టం
మంద గొడ్ల వెనక పేడ కోసం పరుగులు తీసే పీటీ ఉష
కరింపాకు కట్టల్లో, కుట్టే ఇస్తళ్లలో అమ్మ మునివేళ్ల నైపుణ్యం
ఎండ పూట చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు
సాయంత్రం అమ్మే సన్నజాజి మూరలు
చూరులో దాచే చిక్కెంటికల చుట్టలు
గోజారి సాధించే కొసరు రొయ్యలు
బతుకు నడిచే బాట తెలిసిన వ్యవహర్త మాయమ్మ
తళతళల తెల్ల జుబ్బాలో దాగిన
నాన్న పెద్దరికాన్ని కాపాడే కనిపించని కవచం మా అమ్మ

వెన్నెల రాత్రి మొల్లజాజి పాదులో
ఉడుకుడుకు నీళ్ళానందం
బొడ్లో బహిరంగ రహస్యం
ముక్కుపొడి పొట్లం
ఎంగిలి కంచంలో ఎండు చేప పంచుకునే
మరియంబీ స్నేహం
ఏదీ పట్టని నాన్న మీద కోపాన్ని
వీధి గడప దాటనివ్వని మౌనం
రచ్చ కొచ్చి రంకెలేస్తే
కాలు దువ్వే గజ్జిల గుర్రం
..రెప్ప వాలినా, తెరిచినా అమ్మ జ్ఙాపకాలు

పడమటి గోడకి కొట్టిన పిడకల నిండా
అమ్మ చేతి ముద్రలు
కుడి ఎడమ భుజాల మీద కాయగాసి
మచ్చలై అమ్మలో కలిసిపోయిన శంకు చక్రాలు
తవ్వుకునే కొద్దీ తల్లడిల్లే నిజాలు
కాటిలో కాలిపోయినవెన్నో రహస్యాలు
వాయిదా వేయనింక
ఇప్పుడు అడుగుతున్నా దోసిలి పట్టి,
ఎనభై ఏళ్ళ రహస్యం విప్పమ్మా..
నల్లా నల్లని నాన్నని పెళ్ళాడిన
పద్దెనిమిదేళ్ల ‘పడుచు” ప్రేమ కథ చెప్పమ్మా..
మన్నారుస్వామి కుంభారతి ఆరిపోయాక
చెరిగిపోయిన కళాచిత్రాలు ఏవమ్మా..?
ఎనక చేతులు కట్టుకుని గునగునా నడిచెళ్ళిపోవడం కాదు
ఎనక్కొచ్చి గుప్పెడు అక్షరాలై కురువు తల్లీ!
(ఆంధ్రజ్యోతి వివిధ లో ప్రచురితం)

Posted in కవిత్వం | 2 వ్యాఖ్యలు

అమ్మ వెళ్ళిపోయింది

Image

ఏం మారిందనీ..!?
అన్నీ అలాగే ఉన్నాయ్.

ఎండి నల్ల పెచ్చులు రాలిన ఇనుప గేటూ
చినిగిన దోమ తెరలో చిక్కుకునే వాకిలి తలుపు చిలుకూ
వరండాలో అడ్డదిడ్డంగా పేర్చిన పుస్తకాల అల్మారా
దివాను మంచం మీద అణిగిపొయిన పరుపూ
పట్టీ విరిగిపోయిన చెక్క స్టూలూ
అన్నీ అలాగే ఉన్నాయ్!

ఏం మారిందనీ..!?
వెలిసిన బులుగు రంగు  లుంగీలో చొక్కా లేని నాన్న,
గోడ మీద ఫోటోలో బర బరా ఏదో రాసుకుంటూనే ఉన్నాడు
టీవీ టేబుల్ మీది వైలెట్ పూల గుత్తి వాడనైనా లేదు
ఉడతలు కొట్టిన దోర మగ్గిన సపోటాలు ఇంటెనక రాలుగూనే ఉన్నాయి
ఎండ తగలని తులసి మొక్క ఎదగడమే లేదు
అన్నీ అలీగే ఉన్నాయ్ అమ్మా!

పక్కింటామె, వాకిలీ ఇల్లూ అదే పనిగా ఊడుస్తూనే ఉంది
రాత్రి  ఏ జామునో వీధి కుక్క ఎందుకో ఏడుస్తూనే ఉంది
మెత్తని అడుగుల సుందరం, పిల్లిలా వచ్చి పోతూనే ఉన్నాడు
తెల్ల కొంగల గుంపుల్లా నర్సు పిల్లలు నేల మీద ఎగురుతూనే ఉన్నారు

బ్యాంకూ, ఫోనూ, ఇల్లూ..విష్ణు ఉరకలు పరుగులుగానే ఉంది
గారాల మారాల బంగారు అలకలూ అల్లరీ అలాగే ఉన్నాయ్
పగలు టీవీ, రాత్రి పేపరూ..పాలూ, కూరుగాయలూ.. ఉదయపు వ్యాయామం.. నేను మాత్రం ఏం మారాననీ?

వాకిట్లో గంగిరేణి ఆకులు రాలే తిన్నె ఖాళీగా ఉందమ్మా
కట్టలు తెగని గుండె భారంగా ఉందమ్మా!

Posted in కవిత్వం | 10 వ్యాఖ్యలు

రాకెట్‌ ఎగిరినపుడంతా మొగల్తూరు రైతే గుర్తొస్తాడు

మొగల్తూరు అనగానే టక్కున చిరంజీవి గుర్తొస్తాడు. అరే, కృష్ణంరాజుదీ అదే ఊరు కదా అనుకుంటాం. ఈ సినిమా వ్యవహారం పట్టని పాత తరం వాళ్ళయితే,  బారిష్టర్‌ పార్వతీశంని గుర్తు చేసుకుంటారు. ఈ ముగ్గురూ కాకుండా నాలుగో హీరోని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. పేరు ఎంవైఎస్‌ ప్రసాద్‌. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం డైరెక్టర్‌. అంతరిక్ష శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి గడించినవాడు. పాతిక దేశాలు తిరిగినవాడు. ఐక్యరాజ్య సమితిలో  భారత దేశపు అంతరిక్ష స్వరాన్ని పదకొండేళ్ళ పాటు వినిపించినవాడు. ఉపగ్రహాన్ని మోసుకుని మన నేల మీద నుంచీ ఎగిరిన తొలి రాకెట్టు ఎస్‌ఎల్‌వీ నుంచీ నిన్నటి పీఎస్‌ఎల్‌వీ-సి20 దాకా ప్రతి ప్రయోగంలోనూ భాగం అయినవాడు. మన దేశపు ఖ్యాతిని అంతరిక్షంలో రెపరెపలాడిస్తున్న శాస్త్రవేత్త ప్రసాద్‌ పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో. ప్రసాద్‌ మొగల్తూరు జ్ఙాపకాలే ఈ వారం మా ఊరు..
Image
మా నాన్న మలపాక రామ సూర్యనారాయణ మూర్తి. మొగల్తూరులో టీచరు. హైస్కూల్‌లో ఇంగ్లీషు, లెక్కలు చెప్పేవారు. చెట్లూ, బావులూ, పొలాలూ.. నా బాల్యం అంతా అందమైన ఆ పచ్చని పల్లెలోనే గడిచింది. నాకు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు. ఇద్దరు అక్కలు. అమ్మ భాస్కరం ఎస్‌ఎస్‌ఎల్‌సీ దాకా చదువుకుంది. పిల్లలంతా బాగా చదువుకోవాలని నాన్న కోరిక. పెద్ద కుటుంబం. జీతం సరిపోయేది కాదు. మాకు కొద్దిగా పొలాలుండేవి. రైతులకి కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఏడాదికి రెండు పంటలు పండేవి. ఆ పంటల ఆదాయమే కుటుంబాన్ని నడిపేది. అన్నలంతా అప్పటికే పై చదువుల కోసం మొగల్తూరు దాటేశారు.  ప్రతి నెలా వాళ్ళకి డబ్బులు పంపాలి. నిజానికి ఏలూరులో పీయూసీ చేరేదాకా నాకు  కొరతంటే ఏమిటో తెలీదు. అయినా, మాకు ఏ ఇబ్బందీ రాకుండానే నాన్న  ఏర్పాటు చేసేవారు.
మాకు చదువులకి  అవసరమైనపుడంతా, నాన్న తడుముకోకుండా డబ్బులు పంపేవారు. మొగల్తూరులో  అనంతపల్లి వారని కోమట్ల కుటుంబం ఉండేది. వాళ్ళకి బియ్యం మిల్లు ఉండేది. ఇంకా బట్టల షాపులూ, సరకుల షాపులూ ఉండేవి. ఆ కుటుంబం మాకు పెద్ద బ్యాంకు. ఎప్పుడు అవసరమైనా, ఎంత అవసరమైనా అప్పు పుట్టేది. మా పొలంలో పండిన పంటంతా నాన్న వాళ్ళకే అమ్మి అప్పు తీర్చేవారు. ప్రతి యేటా ఇంతే. అవసరవమైనపుడు తీసుకోవడం, పంటొచ్చినపుడు తీర్చడం. ఎక్కాడా మా చదువులు ఆగకూడదని నాన్న పట్టుదల. మేం కూడా అట్లాగే చదివే వాళ్ళం. ఆటలూ పాటలూ ఉన్నా, చదువులో ఎప్పుడూ నేను వెనకబడలేదు.
నాన్న పుస్తకాలు బాగా చదివేవారు. మాతో చదివించేవారు. పద్యాలు రాసేవారు. ఇంటి నిండా పుస్తకాలుండేవి. ఎస్‌ఎస్‌ఎల్‌సీ స్కూల్‌ ఫస్ట్‌ వచ్చాను. నాకు  బహుమతిగా మహాభారతం ఒరిజినల్‌ సెట్‌ ఇచ్చారు నాన్న. ఇప్పటికీ అది నా దగ్గరుంది. చిన్నతనంలో నేను బాగా ఇష్టంగా చదువుకున్న పుస్తకం ‘ఆంధ్రశ్రీ’. అల్లూరి సీతారామరాజు గురించిన పద్య కావ్యం. బహుశా పడాల రామారావు రాసిందనుకుంటాను. ఆ పుస్తకం చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచేది.
గురువులకి నమస్కారం
నా తొలి గురువు పొదిల కృష్ణమూర్తి గారు. మా ఇంటి పక్కనే బడి ఉండేది. అమ్మాయిల బడి. నేను ఒకటో తరగతిలో చేరే సంవత్సరమే కో-ఎడ్యుకేషన్‌ చేశారు. అందరూ అమ్మాయిలే. నేనొక్కడినే అబ్బాయిని. ఆడ పిల్లల మధ్య కూర్చునే వాడిని కాదు. టీచర్‌ కుర్చీ పక్కనే కింద కూర్చునేవాడిని. బాగా చదువుకున్న వాడు ఆయన. ఊరెళ్ళినపుడు ఇప్పటికీ ఆయనకి నమస్కారం పెట్టుకుంటాను.  ఆరు, ఏడు తరగతుల్లో ఉస్మానీ గారని ఇంకో టీచర్‌ ఉండేవారు. ఆయన ఏ పాఠాన్నయినా కథగా మార్చి చెప్పేవారు. ఎంత అల్లరి చేస్తున్నా, కోపంగా గాక, సరదా మాటలతోనే సద్దు మణిగేట్టు చేసేవారు. ప్రతి మాటా చమత్కారంగానే ఉండేది.  లెక్కల టీచర్‌ రామకృష్ణరావు అంటే మాత్రం అందరికీ హడల్‌. చాలా స్ట్రిక్ట్‌. హిందీ అయ్యవారు బాపిరాజు గారు పక్క ఊరి నుంచి సైకిలు మీద వచ్చేవారు. హిందీలో నాకు మంచి మార్కులు వచ్చేవి. పులికొండ వెంకటేశ్వరరావు గారు తెలుగు చెప్పేవారు. ఎంత శ్రావ్యంగా ఉండేదో ఆయన పాఠం, పాటలాగా. పిల్లలతో ఎంత ప్రేమగా, ఎంత దయగా ఉండేవారో వీళ్ళంతా. ఇటువంటి టీచర్ల వల్ల చదువంటే ఇష్టంగా ఉండేది. గౌరవంగా ఉండేది.
హైస్కూల్‌లో  సత్యనారాయణ రాజు గారని సైన్స్‌ టీచర్‌ ఉండేవారు.  పిల్లల్తో అవీ ఇవీ మాట్లాడుతూ ఉండేవారు. ఒక సారి క్లాసులో ఒక్కొక్కరినీ లేపి, పెద్దయ్యాక నువ్వేం కావాలనుకుంటున్నావ్‌? అని అడుగుతున్నారు. నా వంతు వచ్చింది. , ‘ ఫారిన్‌ రిటర్డ్న్‌ ఇంజనీరు అవ్వాలనుకుంటున్నా సార్‌’ అన్నా. ఆయనతో సహా అందరూ నవ్వారు. ఊళ్ళో ఎవరికైనా జబ్బు చేస్తే, ఏలూరెల్లండి, బెజవాడెల్లండి ఫలానా ఆయన ఫారిన్‌ రిటర్న్‌ డాక్టర్‌..ఆయన దగ్గరకే వెళ్ళండి అని చెప్పే వాళ్ళు. ఫారిన్‌ రిటర్డ్న్‌ అంటే గొప్ప అని నేను అట్లా చెప్పాను. అయితే, నేను పెద్దయ్యాక అదే నిజమైంది. ఇంజనీరుగా ఇరవై అయిదు దేశాలు పర్యటించాను. ప్యారిస్‌లో నాలుగేళ్ళున్నాను. ఇటీవల మొగల్తూరు వెళ్ళినపుడు అప్పటి మా సైన్స్‌ టీచర్‌ సత్యనారాయణ రాజు గారికి ఈ సంఘటన గుర్తు చేశాను.
నాతో పాటూ మొగల్తూరులో చదువుకున్న ఎందరితోనో ఇప్పటికీ స్నేహం కొనసాగుతోంది. అనంతపల్లివారి రాధాకృష్ణ, అక్కడే వ్యాపారం చేస్తున్నాడు. మధిర సీతారాం, నర్సాపురం కాలేజీలో పనిచేసి రిటైరయ్యాడు. సుబ్బరాజు, బీమవరం ఇంజనీరింగ్‌ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ అయ్యాడు. పాలా వెంకటేశ్వరరావు నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌లో ఫైనాన్స్‌ మేనేజర్‌గా చేశాడు. పడాల భాస్కర్‌రావు హైస్కూల్‌ హెడ్‌ మాస్టర్‌గా చేశాడు. వీళ్ళ స్నేహాభిమానాలు ఇప్పటికీ నాకు అలాగే ఉన్నాయి.
ముంచెత్తిన అభిమానం
1982లో నాన్న చనిపోయారు. అమ్మ మొగల్తూరులోనే ఉండేవారు. అమ్మ కూడా పోయాక  20యేళ్ళు మొగల్తూరులో అడుగు పెట్టలేదు. 2006లో తిరిగి వెళ్ళాను. అమ్మా నాన్నా దూరమైనా, అమ్మలాంటి ఊరుందని మాత్రం అనిపించింది. సుదీర్ఘ విరామం తర్వాత మొగల్తూరు ప్రయాణం నాకు జీవితాంతం మరచిపోలేని అనుభూతినిచ్చింది. కొద్దిగా పొలాలూ, పాడు బడిపోయిన ఇల్లూ తప్ప  నా అనుకోవడానికి ఎవరూ లేరు. ఊరికి వస్తున్నానని ఒక్క రోజు ముందు పాత స్నేహితులకి ఫోన్‌లో చెప్పాను. ఊళ్ళో అడుగు పెట్టగానే నాకు లభించిన స్వాగతం అపూర్వం. మా ఇల్లూ , పెరడూ శుభ్రం చేయించారు. షామియానాలు వేయించారు. ఊరంతా వచ్చారు, నన్ను పలకరించడానికి. నాకు చదువు చెప్పిన టీచర్లు, నాతో కలిసి చదువుకున్నవాళ్ళు. ఆశ్చర్యం, ఆనందం. చంద్రయాన్‌ ప్రాజెక్టు గురించి అంతకు మునుపే పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌ కీలక బాధ్యతల్లో నేను కూడా ఉన్నానని రాశారు. నాకు సంబంధించినంత వరకూ, వరుస రాకెట్‌ ప్రయోగాల్లో చంద్రయాన్‌ కూడా ఒకటి. అంతకన్నా ప్రాధాన్యం లేదు. మొగల్తూరుకి మాత్రం అది ప్రత్యేకం. మా మొగల్తూరు వాడు చంద్రుడి మీదకి రాకెట్‌ పంపుతున్నాడని వాళ్ళ సంబరం. మొన్న నాకు నాయుడమ్మ అవార్డు ప్రకటించినపుడు కూడా మా ఊళ్ళో నా ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారని తెలిసినపుడు కలిగిన పులకింత, ఐక్యరాజ్యసమితిలో అంతరిక్ష వ్యర్ధాల మీద భారత వాదనను వినిపించి మెప్పించి ఒప్పించినపడు కూడా కలగలేదు. మొగల్తూరు పేరు వినగానే కలిగే పులకింత అది. ఊరితో, మట్టితో, మనుషులతో ఉండే అనుబంధం అది.
లాంతర్ల వెలుగులో ఇంజనీరింగ్‌
పీయూసీ పాసయ్యాక ఇంజనీరింగ్‌లో చేరాను. సెలవు దొరికితే చాలు మొగల్తూరులో వాలిపోయేవాణ్ణి. కరెంటు లేదు. ఇంజనీరింగ్‌ సెకండియర్‌ దాకా లాంతర్ల కిందే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచీ ఇలాగే చదువుకున్నాను కనుక నాకేం పెద్ద తేడా తెలిసేది కాదు. పొలానికెళ్ళి వ్యవసాయం చెయ్యకపోయినా. ఇంటి  పెరట్లో ఆకు కూరలూ, కూరగాయలూ మేమే పండించుకునేవాళ్ళం. ఆ పనిలో గొప్ప ఆనందం ఉండేది. ఉద్యోగం వచ్చి ఊరొదిలే దాకా కూడా స్నేహితులతో కలిసి ఊరెమ్మట మామిడి తోటల్లో తిరిగేవాడిని. రేడియోలో బీబీసీ వింటూనే చదువుకునే వాడిని. పాటలు వినడం, పాడడం, సాహిత్య పుస్తకాలు చదవడం, నాటకాలు వేయడం వంటివి నాకు ఇష్టవమైన పనులు. నా చదువుకి ఇవి ఎప్పుడూ ఆటంకం కాలేదు. విదేశాలకు వెళ్ళినా, హసన్‌లో, త్రివేండ్రంలో ఏ హోదాలో ఉన్నా నా చదువు ఆగలేదు. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ఫిక్షన్‌నే ఎక్కువగా ఇష్టపడేవాడిని. పత్రికల్లో వచ్చే కథలూ, సీరియల్సూ కూడా వదలకుండా చదివేవాడిని. ఆంధ్రప్రభ వీక్లీలో అనుకుంటాను, ‘దానిమ్మ పండు’ అని ఒక కథకి బహుమతి వచ్చింది. ఒక పేద కుటుంబంలోని అన్నా చెల్లెళ్ల కథ అది. చిన్నపుడు చెల్లెలికి దానిమ్మ పండు తినాలని కోరిక. అన్నని అడుగుతుంది. పెద్దయ్యాక గానీ ఆ అన్న చెల్లెలి కోరిక తీర్చలేక పోతాడు.  పల్లెటూరి పేద కుటుంబం జీవితాలను అద్భుతంగా చిత్రించిన కథ అది. రచయిత పేరు గుర్తు లేకపోయినా  కథ గుర్తుంది ఇప్పటికీ.
రావిశాస్త్రి చూపిన దారి
రాచకొండ విశ్వనాధశాస్త్రి నవలలన్నా, కథలన్నా చాలా ఇష్టం నాకు. కొడవటిగంటి కుటుంబరావు కథలు కూడా చదివేవాడిని. అయితే రావిశాస్త్రి రచనా శైలి ఎక్కువగా నచ్చేది. శ్రీశ్రీ కవిత్వాన్ని ఇష్టపడినంతగా రావిశాస్త్రి వచనాన్నీ ఇష్టపడేవాడిని. రత్తాలు రాంబాబు నవల కనీసం మూడు నాలుగు సార్లన్నా చదివుంటాను. ఆయన సొమ్మలు పోనాయండీ! కూడా అంతే. వార్‌ అండ్‌ పీస్‌ చదివినపుడు నాకు ఎటువంటి ఫీలింగ్‌ కలిగిందో, అటువంటి ఫీలింగే నాకు రత్తాలు రాంబాబు చదివినపుడూ కలిగింది. అసలు గొప్ప రచయితలు ఎవ్వరూ, తమ పాత్రలకి అన్యాయం చేయరు. ఏ పాత్రనీ తక్కువగా చూపించరు. సమన్యాయం పాటిస్తారు. ‘వార్‌ అండ్‌ పీస్‌’ నవల చదివితే, కనీసం ముప్పయి నలభై యేళ్ళ జీవితానుభవం మనకు అదనంగా లభిస్తుంది. చెహోవ్‌ కథలు కూడా గొప్పగా ఉంటాయి. మనకు ఉన్నది ఒకే జీవితం. పుస్తకాలు చదవడం వల్ల అనేక జీవితాలు లభిస్తాయి.  
మాది చాలా ఒత్తిడి ఉండే ఉద్యోగం. ఒక్కోసారి నెలల తరబడి ఆ ఒత్తిడిని పగలూ రాత్రీ తేడా లేకుండా మోయాల్సి వస్తుంది. ఏ ఎస్‌ ఎల్‌ వీ రాకెట్‌లు రెండు వరుసగా ఫెయిలయినపుడు విపరీతమైన టెన్షన్‌కు గురవ్వాల్సి వచ్చింది. ఈ సమయంలో ఈ ఒత్తిడి నుంచి నన్ను కాపాడింది, మొగల్తూరులో నాన్న నాకు నేర్పిన పుస్తక పఠనమే. ఆఫీసు నుంచి రాత్రి పదింటికి ఇల్లు చేరేవాడిని. స్నానం చేసి, భోంచేసి మూడింటి దాకా పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఎక్కువగా రెండో ప్రపంచ యుద్ధకాలానికి సంబంధించిన రచనలు ఎక్కువగా చదివాను. యుద్ధ కాలంలో మానవ జీవన సంఘర్షణను అర్ధం చేసుకున్నాక, వాళ్ళు అనుభవించిన ఒత్తిళ్ళ ముందు మనవి ఎంత అనిపించేది. మనసు తేలిక పడేది. పొద్దున్నే కొత్త శక్తితో మళ్ళీ పనిలో పడేవాడిని.
రైతూ, నేనూ వేరు కాదు
రాకెట్‌ విఫలమైనపుడు మీరెందుకు అంతగా కుంగి పోతారు? అని అడుగుతుంటారు కొంతమంది. రాకెట్‌ ఒక యంత్రమే కావచ్చు, కానీ అందులోని అనేక భాగాలను రూపొందించి, అమర్చిన వాళ్ళకి అది ఒట్టి యంత్రం మాత్రమే కాదు. ఎస్‌ఎల్‌వీ అపజయం సమయంలో తొలుత నేను గంభీరంగానే ఉన్నాను.  అప్పుడు మా టీం లీడర్‌ కలాంగారు. రాకెట్‌ విఫలమైందని నిర్ధారించుకున్న కొంత సేపటి తర్వాత ఆయన్ని కలిశాం. కలాంగారిని చూడగానే దుఖం కట్టలు తెంచుకుంది. ఏఎస్‌ఎల్‌వీ రెండు వైఫల్యాల వేళ కూడా నేను కన్నీళ్ళని ఆపుకోలేక పోయాను. 40 యేళ్ళ లోపల యువకుడిగా ఆ మాత్రం భావోద్వేగాలు సహజమే అనుకుంటాను. ఇప్పటికీ రాకెట్‌ ఎగిరిన ప్రతి సారీ నాకు మా మొగల్తూరు రైతులే గుర్తొస్తారు. నారు పోసి, నీరు పెట్టి, కలుపు తీసి ఫలితం చేతికి వచ్చేదాకా పడే టెన్షన్‌ గుర్తొస్తుంది. ఏ వరదో వచ్చి పంట పోయినపుడు భోరున ఏడ్చే ఏడుపు గుర్తొస్తుంది. ఆర్ధికంగా నష్టపోయామనే కాదు, ఆ ఏడుపు. ఆ పైరుతో రైతుకి పెనవేసుకున్న అనుబంధం అది. రైతుకి పైరుతో ఉండే అనుబంధమే, రాకెట్‌తో శాస్త్రవేత్తకీ ఉంటుంది. బంధానుబంధాలు, భావోద్వేగాలు మనుషులందరిలోనూ ఒక్కటిగానే ఉంటాయి. వాళ్ళు రైతులా శాస్త్రవేత్తలా అని కాదు, వాళ్ళు మనుషులైతే చాలు.

(ఆంధ్రజ్యోతి దినపత్రికలో మా ఊరు శీర్షిక లో అచ్చయింది)

Posted in వ్యాసం | 2 వ్యాఖ్యలు

కథకీ నేపథ్యానికీ మధ్య..

Image
“బిడ్డలుగల్ల తల్లి’ కథ రాసినపుడు నాకు ఒక సమస్య ఎదురైంది. మా వూళ్ళో, మా బంధువుల ఇంట్లో జరిగిన సంఘటన అది. నేను వూరికి పొయినప్పుడంతా మా అమ్మా, మా అక్కా

వూరి సంగతులన్నీ పూసగుచ్చినట్టు చెబుతుంటారు. అట్లా విని, వచ్చి ఉన్నదున్నట్టుగా కథ రాసేశాను. పూర్తయిన కథని చదువుకున్నపుడు మాత్రం ఒళ్ళు జలదరించింది. “ఈ కథ మా

వూళ్ళో ఎవరైనా చదివితే..!?’ నా వీపు విమానం మోత మోగుతుంది. ఎందుకొచ్చిన గొడవ? రాసిన కథని చించెయ్యలేను. అలాగని అచ్చుకీ ఇవ్వలేను. అప్పుడొక బ్రహ్మాండమైన ఐడియా

తట్టింది. చక చకా కథలోని పాత్రల పేర్లన్నీ మార్చేశాను. ఇంక ఈ కథ వాళ్ళదే అనుకోడానికేం లేదు.ఇంకేం, పత్రికకు పంపెయ్యచ్చని అనుకున్నాను. పంపే ముందు ఎందుకైనా మంచిదని

మళ్ళీ ఒక సారి చదివాను. పేర్లు మారాయిగానీ, వాస్తవం తెలిసిన మా వూరి వాళ్ళు ఎవరైనా ఇది ఎవరి కథో సులువుగా కనిపెట్టేయగలరు. పెద్దగా ఉపయోగం లేదు. ఏం చేయాలింక?  

వాస్తవ సంఘటనలకి కొన్ని కల్పనలు జోడించాను. పాత్రల స్వభావంలో  మార్పులు చేశాను. ఇప్పుడింక, ఏ పాత్ర ఎవరో కనిపెట్టలేరని నా నమ్మకం. ఆ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో

అచ్చయింది. ‘నీకేం నాయినా.. పండక్కో పబ్బానికో వూళ్ళోకొస్తావు. రోజూ మొహాలు మొహాలు చూసుకునేవాళ్ళం, ఎవురు పడతారు యిదంతా’ కథకి  మా అమ్మ స్పందన ఇది. కథలో

ఒక సైడు పాత్రగా కనిపించిన మా రాంబావ అయితే నేను ఎక్కడ ఎదురుపడ్డా కొరకొరా చూస్తాడు యిప్పటికీ. ఆయన భార్య తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది నన్ను చాలా మంది దగ్గర.

భర్తనొదిలి లేచిపొయిన “రాజమ్మ’ని చూసినపుడంతా నాకు ఏదో తప్పు చేసిన ఫీలింగే కలుగుతుంది. కథలు వాస్తవికంగానే ఉండాలి కదా! మరి వాస్తవం రాస్తే ఈ గొడవేంటి ? వాస్తవ

సంఘటనలు రాసేటపుడు ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు జరిగింది జరిగినట్టు రాయచ్చా, రాయకూడదా? మూడో కథకే ముచ్చమటలు పోశాయి నాకు. అసలీ ప్రశ్నలన్నీ

కథలు రాసే అందరికీ వస్తాయా, కొత్తగా రాస్తున్న నాకేనా? ఇట్లా ఆలోచిస్తుండగానే ఆదివారం ఆంధ్రజ్యోతి సంపాదక బాధ్యతల్లో భాగంగా విపరీతంగా కథలు చదివే అవసరం పడింది. ఒక

కథ ఎంపిక చేయడానికి కనీసం పాతిక కథలు చదవాల్సి వచ్చేది. నిష్ణాతులైన కథకులు మొదలు కొత్తగా రాస్తున్న ఎందరి కథలో చదువుతున్నపుడు చాలా మందిలో నన్ను నేను

చూసుకున్నాను. రాయడం ఏమో గానీ, కథలు చదవడం నేర్చుకున్నాను. ఏ కథలో ఏం లోపించిందో తెలిసిపోయేది. ఇలా ఉంటే బావుండేది కదా అనిపించేది. కథలోని సంఘటనల్లో,

సంఘటనల్లోని పాత్రల తీరులో కొన్ని మార్పులు చేస్తే కథ ఇంకా మెరుగ్గా ఉంటుందని అర్ధమయ్యేది.  అలా అనిపించిన కొన్ని కథల గురించి, ఆ  రచయితల్లో కొందరితో మాట్లాడేవాడిని.

“నిజం.. సరిగ్గా అట్లాగే జరిగింది’ అనేవాళ్ళు. ఓహో..జరిగింది జరిగినట్టు రాస్తే కథైపోదన్నమాట. వాస్తవానికీ, కథకీ మధ్య ఏవో మార్పులు జరగాలి. జోడింపులుండాలి. మరి, గొప్ప

కథలుగా పేరున్న కథల వెనుక వాస్తవాలు తెలుసుకుంటే కథలు రాసే కిటుకు తెలిసిపోతుందేమో! ఇట్లా మొదలైంది, కథానేపథ్యాల కోసం నా వెతుకులాట. ఏడాది పాటు చిన్నా, పెద్దా

కథకులందరి వెంటా పడ్డాను. ఉత్తరాలు రాశాను. ఫోన్లు చేశాను. కొందరు రాశారు. కొందరు రాస్తామన్నారు. కొందరు రాయం అన్నారు. కొందరు తప్పించుకున్నారు. నేపథ్యానికీ కథకీ

మధ్య జరిగిన మార్పులేమిటి? ఎందుకు ఆ మార్పులు అవసరం అయ్యాయి? అవి కథకు ఇచ్చిన బలం ఏమిటి? ప్రసిద్ధ కథలకు నేపథ్యాలుగా ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టగలిగితే,

కథలు రాద్దామని ఉత్సాహపడే వారికి ఇవి పాఠాలుగా ఉపయోగపడుతాయని ఆశ పడ్డాను. మధురాంతకం రాజారాం “సర్కస్ డేరా’తో  కథానేపథ్యాల ప్రచురణ మొదలైంది. కథా రహస్యం  

తెలిసిపోతోందనే సంబరం కలిగేది, నేపథ్యం అందుకున్న ప్రతిసారీ. సంబరం అంబరాన్నంటేది కొన్నిసార్లు. నిరాశే మిగిలేది చాలాసార్లు. అడిగి మరీ రాయించుకున్నాను గనుక అచ్చేయక

తప్పలేదు కొన్నింటిని. అడక్కపోయినా రాసి పంపేయడం మొదలు పెట్టారు చాలా మంది. మొహమాటానికి పోతే ఇంకేదో అవుతుందనే భయం వేసి, ఇంక ఆపేయడం

మంచిదనుకున్నాను. ముప్పయి నాలుగో నేపథ్యం మహేంద్రది. మధురాంతకం రాజారాంతో  మొదలై  ఆయన కుమారుడు మహేంద్రతో ఆగిపోయింది కథానేపథ్యం. ఆ ఇద్దరూ ఇప్పుడు

లేరు. నా ఆలోచనకు అక్షరరూపం ఇచ్చి వెళ్ళిపోయారు. కథానేపథ్యం పుస్తక రూపంలో వస్తున్న సమయంలో ఆ ఇద్దరినీ ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాను.

1 వ్యాఖ్య

అతనూ ఆమె

Image
అతనప్పుడు రెక్కలున్న పిట్ట
గూడు మరచిన పక్షి
అలలతొ ఆటలు, మబ్బులతో చెలిమి
తురాయి వనాల విహారం

ఆకాశం అంచుల్ని కలగనే వేళ అతనికి ఆమె నచ్చింది

ఆమె, పెరటితోటలో పూసిన ముద్దబంతి పువ్వు
అతని కోసం ఆమె మొక్కని విడిచింది
ఆమె కోసం అతను రెక్కలు వదిలేశాడు

అతనూ– ఆమె, కువకువలాడే రెండు బుల్లిపిట్టలు
పొందికగా అల్లుకున్న పొదరిల్లు
కనిపించని కంచు గోడలు
వలయవలయాలుగా చుట్టుకున్న ముళ్ళకంచెలు

మనశ్శరీరాలు వికసించిన చోటే వికటించాయి
అభద్రతతో అడుగులు తడబడ్డాయి
గాయం మనసుకి, వైద్యం శరీరాలకి

ప్రేమతో  పెనవేసుకున్న బంధం, ద్వేషంతో తెగిపోయింది
తెగిన ప్రతిసారీ ప్రేమ ఉప్పెనై మళ్ళీ మళ్ళీ ముంచెత్తింది

అభిమానం, అనుమానం, అవమానం, అసహ్యం, అంతులేని మోహం..
ఏది నిజం..ఏది అబద్ధం?!
రెంటికీ మధ్య గీతల్లేకపోవడమే కదా జీవితం!

రెక్కల్లేని పిట్ట, కాడ తెగిన పువ్వు
ఆకాశం అందదు పరిమళం పంచదు
‘ఎంతెంత దూరం…బాయి బాయి దూరం..’
వాకర్ మీద ప్రయాణం తరగదూ కరగదు.

సంక్రాంతి మలి పొద్దుకాడ అతనెళ్ళిపోయాడు
దీపావళి తొలి పొద్దు వేళ అతన్ని వెతుక్కుంటూ ఆమె ఎగిరిపోయింది, అప్పుడే మొలిచిన రెక్కలతో

(మాకు మరో ఇద్దరు బిడ్డల్ని ఇచ్చి వెళ్ళిపోయిన బాబన్నకీ, రాజ్యం వదినకీ)

ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురణ

Posted in కవిత్వం | 3 వ్యాఖ్యలు

రెక్కలొచ్చిన ఆలోచనలు జాజిమల్లి కథలు

Image
అచ్చయిన నాలుగు నెలలకే రెండో ముద్రణ వెలువడడం తెలుగులో అరుదైన విషయం. మల్లీశ్వరి జాజిమల్లి బ్లాగ్‌ కథలు పుస్తకం  పర్‌స్పెక్టివ్స్‌ ప్రచురణలో ఈ  అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే ఐదు నవలలు, ఒక కథా సంపుటి ప్రచురించినా, బ్లాగ్‌ కథలతోనే మల్లీశ్వరి తెలుగు పాఠకులకు ఎక్కువ దగ్గరయ్యారు. మల్లీశ్వరి మునుపటి రచనలకీ బ్లాగ్‌ రచనలకీ మధ్య బోలెడంత తేడా కనిపిస్తుంది. ఏ నియంత్రణలూ లేని బ్లాగ్‌లో ఆమె ఆలోచనలూ, అక్షరాలూ పదునెక్కాయి. ప్రతి రచనతోనూ ఆమె పాఠకులతో ఎప్పటికప్పుడు సంభాషించారు. తన ఆలోచనకీ, వ్యక్తీకరణకీ మధ్య తేడాలేమైనా ఉంటే ఆమెకి వెనువెంటనే తెలిసిపోయేవి. రాసి పోస్ట్‌ చేసిన గంటకే అభినందనలూ, అభిప్రాయాలూ, విభేదాలూ అందడం మొదలయ్యేవి. ప్రతి రచనా ఆమెకి కొత్త పాఠాలు నేర్పేది. బ్లాగ్‌ లో ఉన్న ఈ సాంకేతిక సౌలభ్యం, రచనా నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి మల్లీశ్వరికి బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా సాహిత్య రూప సరిహద్దులు చెరిగిపోవడం వల్ల తనకి ఎప్పుడు, దేనిగురించి మాట్లాడాలనిపించినా ఏ సంకోచమూ లేకుండా జాజిమల్లి బ్లాగ్‌లో రాసేశారు. ఆలోనచన, అనుభవం, అభిప్రాయం, జ్ఙాపకం, అనుభూతి.. ఇలా తనకు రాయాలనిపించిన వాటినంతా బ్లాగ్‌ చదువరులతో పంచుకున్నారు. అచ్చులో లాగా వీటికి పేజీల కొలతల్లేవు. కథ, కవిత్వం, వ్యాసం, ఆత్మకథ వంటి రూపభేదాల్లేవు. ఒక రకంగా ఇవి, మల్లీశ్వరి తనకు తాను చెప్పుకున్న సంగతులు. అప్పుడున్న స్థితిని బట్టీ, రాస్తున్న అంశాన్ని బట్టీ వాటికవే రూపాలు తీసుకున్నాయి. అందుకే డైరీలో రాసుకున్న తీరులో కొన్ని రచనలు కనిపిస్తాయి. స్నేహితులకు రాసిన ఉత్తరాలను పోలి ఉంటాయి మరికొన్ని. బాల్య జ్ఙాపకాల్లా ఉల్లాసాన్నిస్తాయి ఇంకొన్ని. చిట్టి పొట్టి కథల్లా పురుడుపోసుకున్నాయి కొన్ని బ్లాగ్‌ రచనలు. కొన్ని పోస్టులు చదివితే  వర్తమాన సామాజిక,రాజకీయ,ఆర్థిక అంశాలని వ్యాఖ్యానించే కాలమిస్ట్‌లా కనిపిస్తారు మల్లీశ్వరి. స్త్రీవాద దృష్టి కోణంలోంచి మానవసంబంధాలనీ, అందులోని వైరుధ్యాలనీ, సమకాలీన సంఘటనలనీ, ఆధునిక పరిణామాలనీ ఆమె వీక్షిస్తారు. వాటి మంచి చెడ్డలని విశ్లేషిస్తారు.  తేలిక పదాలు, చిన్న చిన్న వాక్యాలు, ఎదుటి మనిషితో మాట్లాడుతున్నట్టుగా ఎంతో హాయిగా చదవచ్చు జాజిమల్లి బ్లాగ్‌ను. గ్రామాణ పాత్రలను పరిచయం చేసినపుడు సౌందర్యాత్మకమైన మాండలికాన్ని అక్షరబద్ధం చేశారు. కొన్ని సంభాషణలు, కొన్ని అనుభూతులు కవితాత్మకంగా సాగుతాయి. నవలల్లో, కథా సంపుటిలోని కథల్లో అతి సాధారణ రచయితగానే కనిపించిన మల్లీశ్వరి జాజిమల్లితో తప్పక చదవాల్సిన రచయితగా మారారు. పాపులర్‌ రచయితల ప్రభావంలోంచి బయటపడి, స్త్రీవాదాన్ని కావులించుకుని,ప్రాంతీయ , కుల వాదాల పట్ల గౌరవాన్నీ సంఘీభావాన్ని ప్రకటించుకుని , మార్క్సిస్టు ఆలోచనాధోరణిని మల్లీశ్వరి అంది పుచ్చుకుంటున్నట్టుగా ఆమె సాహిత్య ప్రయాణాన్ని పరిశీలిస్తే అర్ధమవుతుంది.  ప్రయాణంలో మజిలీలు మాత్రమే ఉంటాయి, అంతిమ గమ్యాలేవీ ఉండవనే చారిత్రక స్పృహతో మల్లీశ్వరి సాహిత్య ప్రయాణం కొనసాగుతుందనే ఆశ, మరింకా ఎన్నో మంచి రచనలు ఆమె నుంచి వస్తాయనే నమ్మకం జాజిమల్లి కలిగిస్తోంది.
జాజిమల్లి, బ్లాగ్‌ కథలు, పర్‌స్పెక్టివ్స్‌ ప్రచురణ, వెల 80రూపాయలు, ప్రతులు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తాయి.

వ్యాఖ్యానించండి

అక్షరాల పిచ్చోడు మా అన్న

పండగ వెళ్ళిపోయింది. ఒక్క నిప్పటి అయినా తినకుండానే, ఒక్క మురుకు ముక్క అయినా కొరక్కుండానే పండగ వెళ్ళిపోయింది. భగభగలాడే భోగి మంట చుట్టూ భోగే..భోగి అని అరుస్తూ తిరిగే మా పిలకాయల చేతుల్లో మోగించడానికి ఈసారి డప్పులు లేవు. ఊళ్లూ, వీధులూ తిరిగి వెతికి వెతికి డప్పులు తేవడానికి ఈసారి మా అన్న లేడు. మా అన్న లేకుండానే పండగ వెళ్ళిపోయింది.
మా అన్న ఆర్‌ ఎం ఎస్‌ ప్రకాష్‌బాబు ఒక గ్రామీణ విలేకరి. ఆంధ్రప్రదేశ్‌కు ధక్షిణపు కొనాకొసన తడ అనే చిన్న పల్లె ఆయన వార్తా సామ్రాజ్యం. పొడవాటి పులికాట్‌ తీరం, పులికాట్‌ రొయ్యలతో పెనవేసుకున్న పట్టపు కుప్పాలు. కుప్పాల్లోని ప్రజల ఆచార వ్యవహారాలు, శ్రీహరికోట నుంచి ఎగిరే రాకెట్లు, విజయాలు, వైఫల్యాలు, పచ్చని పొలాల్ని మింగేసిన పరిశ్రమలు, నాలుగు పడగల నాగులాంటి జాతీయ రహదారిపై వుండుండీ వినిపించే మరణఘోష… వీటి మధ్య ఆర్‌ ఎం ఎస్‌ ప్రకాష్‌బాబు. తడ అనే రెండక్షరాల బుల్లి పల్లెను ప్రపంచానికి ఆయన ప్రతి రోజూ వైవిధ్యభరితంగా నివేదించాడు. తెలుగు, తమిళ భాషా సంస్కృతులు కలగలసిపోయిన ఆ ప్రాంతంలో జరిగే ప్రతి పరిణామాన్నీ ఆయన వార్తలుగా రికార్డు చేశాడు. పులికాట్‌ దీవుల్లోని జనం కష్టసుఖాలనీ, వాళ్ళ ఆచార వ్యవహారాలనీ, కట్టుబాట్లనీ కథనాలుగా మలిచాడు. ఉక్కు కవచాలు ధరించి, బల్లాలూ బరిసెలూ చేతబట్టుకుని పట్టపు కుప్పాలు కొట్లాటలకు దిగినపుడు, ఆ రగిలే పగల మధ్యకు కెమెరా పట్లుకుని వెళ్ళిపోయేవాడు. వారి సాహసోన్మాద సంస్కృతిని వార్తా ప్రపంచం ముందుంచి చేతులు దులుపుకోలేదు. ప్రాణాంతకమైన పట్టపు పగలు రాజుకున్న పోబిడి తెలియగానే పోలీసులకూ, జిల్లా అధికారులకూ సమాచారం ఇచ్చి హెచ్చరించేవాడు. తుపాన్లకు చిగురుటాకుల్లా కుప్పాలు వణికిపోతున్నపుడు, అలలతో హోరెత్తే భయభీకరమైన సరస్సులో నాటు పడవమీద సహాయక సిబ్బందితో కలిసి ప్రయాణమయ్యేవాడు. దిన పత్రికలో అచ్చయ్యే ఒకే ఒక్క ఫోటో కోసం, ఒక్క వార్త కోసం ఆయన వెర్రిగా పరుగులు తీసేవాడు. ఆ వెర్రి ఆయనకు వారసత్వంగా ఇచ్చిన వాడు మా నాయన ఆర్‌ ఎం ఆంజనేయులు.
శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగాలను రిపోర్టు చేయడానికి జాతీయ మీడియాను మాత్రమే అనుమతించే కాలంలో, ప్రాంతీయ పత్రికల అనుమతి కోసం మా అన్న ప్రకాష్‌బాబు తన సహచరులను పోగేసి పోరాటానికి దిగాడు. రాకెట్‌ కేంద్రం ప్రధాన గేటు ముందు టెంట్‌ వేసి,నినాదాలు చేసి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల చేత లాఠీ దెబ్బలు తిన్నాడు. సరిహద్దులు దాటే బియ్యం, సిలికాన్‌, ఇసుక మీద నిఘా వేసి, వార్తలు రాసి అనేక సార్లు ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. లౌక్యపు మాటలతో ప్రతిసారీ తప్పించుకున్నాడు. రాకెట్‌ కేంద్రంలో బయటకు పొక్కని ప్రమాదాలనూ, నివురుగప్పిన ప్రాంతీయ వివక్షనూ వార్తల కెక్కించేవాడు. అంతరిక్ష ప్రయోగాల్లో తెలుగు శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలను వార్తలుగా రాయడానికి తపించేవాడు. ఆయన అక్షరం నిప్పులు గక్కినా మాట మంచులా ఉండేది. వార్తా ప్రపంచంలో ఆయన పెన్ను చేతబట్టుకుని ముప్పయ్యేళ్ళు ప్రయాణించాడు. నెల్లూరు నుంచి వచ్చే లాయర్‌ పత్రికతో ఆయన పాత్రికేయ జీవితం మొదలైంది. ఆంధ్రజ్యోతితో పాతికేళ్ళ అనుబంధం. జేవీ కృష్ణమూర్తి, కెఎన్‌ చారి, రాంప్రసాద్‌, సౌద, నామిని వంటి వారు ఆయన వార్తలను ఇష్టంగా ప్రచురించేవారు. తడ నుంచి బస్సులో వార్తల కవర్‌ రాగానే తడ..గుండె దడ అనే వాడు కెఎన్‌ చారి. చిన్న కేంద్రం నుంచి ఎన్నో సంచలన వార్తలు రాశాడు. తడ డేట్‌లైన్‌తో ఎన్నో బేనర్లు అచ్చయ్యాయి. ఒక కంట్రిబ్యూటర్‌ వార్తలు బైలైన్‌తో అచ్చవడం అరుదు. ఆ అవకాశం అనేక సార్లు ప్రకాష్‌బాబుకు లభించింది. ఆదివారం అనుబంధంలో ఎన్నో కథనాలు రాశాడు. వార్తలను వెర్రిగా ప్రేమించాడు. హెడ్డింగ్‌లో తప్పొచ్చినా, ఫోటో రైటప్‌ మారిపోయినా కోపంతో ఊగిపోయేవాడు. వార్తలను వెతుక్కుంటూ కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగేవాడు. ఆయన జీవితం విలక్షణంగా సాగింది. నెల్లూరు విఆర్‌ కాలేజీలో డిగ్రీ చదువుకునే రోజుల్లో డీఎస్‌ఓ లో పని చేసేవాడు. ఆయన ట్రంకుపెట్టెలోని ఎర్ర అట్ట పుస్తకాలు చూసి మా కుటుంబమంతా వణికిపోయేది. నక్సలైట్‌గా మారిపోతున్నాడని గుసగుసగా చెప్పుకునేవాళ్ళు. ఇల్లు పట్టకుండా తిరిగే మా అన్న నాకు మాత్రం హీరోలా కనిపించేవాడు. డిగ్రీ పూర్తవగానే ఒక ఎన్జీవోలో పనిచేశాడు. గిరిజనులతో కలిసి జీవించాడు. ఇంటి పరిస్థితులు ఆయన్ని తిరిగి ఊరికి లాక్కొచ్చాయి. అయినా ఇంటికి పరిమితం కాలేదు. రక్తదాన ఉద్యమం అన్నాడు. హేతువాద సంఘం అన్నాడు. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం. ఇంటర్‌ చదువుతుండగా నాకు అలెక్స్‌ హేలీ ని పరిచయంచేసింది మా అన్నే. హెచ్‌బీటీ పుస్తకాలన్నీ ఆయన దగ్గర ఉండేవి. పుస్తక ప్రేమికుడిగా, హేతువాదిగా, వామపక్ష ఆలోచనావాదిగా నాకు ఆదర్శంగా కనిపించే మా అన్న క్రమంగా కుటుంబంలో కూరుకుపోయాడు. భక్తుడిగా మారిపోయాడు. రాతలో కనిపించే స్పష్టతా, స్థిరత్వం ఆయన మాటలో కనిపించేవి కాదు. అనారోగ్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆసుపత్రుల చుట్టూ తిరగడమే జీవితంగా మారింది. కార్పొరేట్‌ వైద్యానికి సమర్పించుకోవడానికి ఇక తన దగ్గర ఏమీ మిగల్లేదు, ఒక్క తన ప్రాణం తప్ప. ఆ ఒక్కటీ వాళ్ళకిచ్చేసి జనవరి 16న వొట్టి శరీరమై మా ఇంటికొచ్చేశాడు మా అన్న. చివరగా తన కళ్ళనూ దానం చేసి ఇద్దరికి చూపునిచ్చి సూళ్ళూరుపేట స్మశానవాటికలో బూడిదగా మారిపోయాడు. కళకళలాడే కనుమ రోజు మా కళ్ళలో కన్నీరయ్యాడు.
ఏడాది తర్వాత మళ్ళీ పండగొస్తుంది. అందరూ ఇళ్ళకొస్తారు. భోగి మండుతుంది. నిప్పట్ల వాసన, మురుకుల కరకర చప్పుడు. యానాదుల డుబ్బుంకు డ్యాన్సులు. యేట్లో కబాడీ లు. యేడాది పండగరోజు పిక్నిక్‌లు.. అన్నీ వుంటాయ్‌, ఒక్క మా అన్న తప్ప. గుండె పొలమారుతోంది, బాబన్నా.
(ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ప్రచురితమైన వ్యాసం)

Posted in వ్యాసం | 5 వ్యాఖ్యలు

prakashbabu

prakashbabu

rms prakash babu

1 వ్యాఖ్య