గోపురాలు కూలుతున్నాయ్‌

ఒక చారిత్రక విషాదం.
చరిత్ర ఎన్నటికీ క్షమించలేని నిర్లక్ష్యం.
పురా సంస్కృతికి సజీవ సాక్ష్యాలు నేలకూలుతున్న దృశ్యం.
అపురూపంగా దాచుకోవాల్సిన అయిదు వందల యేళ్ళ చరిత్రను చేజేతులా మట్టిపాలు చేసుకున్న పాపం.
ఎవరు కారకులన్నది కాదు, ఎందుకీ దౌర్బాగ్యం అన్నదే ప్రశ్న.
అద్భుత శిల్ప సంపదతో భాసిల్లే శ్రీకాళహస్తి రాజగోపురం మట్టిదిబ్బగా మారడం తాజా నిదర్శనం మాత్రమే. ఇది మొదటిదీ కాదు, చివరిదీ కాబోదు. పరమానందయ్య శిష్యులను తలదన్నే మన పాలక ప్రభువులకు తల్లివేరును తెగతెంచుకోరాదనే జ్ఙానబోధ చేసేవారెవరు? ఆయుష్షు తీరింది గనుకనే అంతరించిందని అతి తేలికగా కర్మ సిద్ధాంతాన్ని వాక్రుచ్చిన అమాత్యుల అజ్జానాన్ని క్షమించగలమా? అయిదు వందల యేళ్ళ కాలం నాటి గోపురాన్ని కూడా కాపాడుకోలేని చేతగానితనం మనదని సిగ్గుపడదామా? వందేళ్ళ నాటి చారిత్రక ఆధారాలను కూడా అరుదైన సంపదగా దాచుకుంటున్న దేశాలను చూసి మనం నేర్చుకుంటున్న పాఠాలేమిటి? అత్యున్నత సంస్కృతి గలిగిన దేశం మనదని అంతర్జాతీయ వేదికల మీద కాలరెగరేసే మనం, సాస్కృతిక వారసత్వ సంపదను మాత్రం అనావశంగా భావిస్తాం. మన మాస్టర్‌ ప్లాన్‌కు అడ్డొస్తే వెయ్యికాళ్ళ మంటపాన్నయినా కూల్చేస్తాం. స్వర్ణకాంతుల ఆకర్షణ కోసం శిలా శాసనాలకు కూడా బంగారు తొడుగులు తొడుగుతాం. మతం నసాళానికి అంటినప్పుడు బాబరీ మసీదునైనా భూస్థాపితం చేసేస్తాం. రాజ ప్రాసాదాలను కూల్చి ఆ రాళ్ళతో ఇళ్ళు కట్టుకుంటాం. అన్నమయ్య రాగి రేకులు కరిగించి బిందెలు చేసుకుంటాం. తెలియని తనాన్ని మన్నించవచ్చు, తెలిసి చేసే తప్పునీ భరించాలా?
సకల కళా పోషకుడిగా కవులు కీర్తించిన శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడై అయిదు శతాబ్దాలు పూర్తయిన సందర్భంగా రాయలు పట్టాభిషేక మహోత్సవాలు జరుపుకుంటున్న వేళే, ఆయన నిర్మించిన విజయ స్ధూపం నేల కూలడం విషాదం కాక మరేమిటి? దక్షిణ భారత విజయయాత్రకు గుర్తుగా 136 అడుగుల ఎత్తయిన గాలి గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదీతీరాన తూర్పు ముఖంగా నిర్మించారు. 1511లో ప్రారంభం అయిన నిర్మాణం 1516లో పూర్తయింది. తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుని వచ్చిన రాయలు శాస్త్రోక్తంగా ఈ గోపురాన్ని ప్రారంభించారు. రాయలేలిన కాలం నాటి కళా విలాసాన్ని ఈ గోపురం మీద చెక్కిన శిల్పాలలో దర్శించవచ్చు. శ్రీకాళహస్తి శిగన అమర్చిన కిరీటంలా పది కిలోమీటర్ల దూరం నుంచి కూడా మెరిసే ఈ రాయలగోపురం ఇక ముందు కనిపించదన్న నిజాన్ని ఈ ప్రాంత ప్రజలు జీర్ణించుకోవడం దేవాదాయ శాఖ అధికారులు చెప్పినంత సులువు కాదు. నిద్ర లేవగానే గోపురం దిక్కు తిరిగి ఒక నమస్కారం పెట్టుకుని దైనందిన జీవనం ప్రారంభించే ప్రజలకు నేనున్నాననే భరోసానిచ్చే రాజగోపురం ఇప్పుడొక మట్టి దిబ్బగా మారడం మన కాలపు విషాదమే. ఈ ప్రమాదాన్ని ముప్పయ్యేళ్ళ కిందటే గుర్తించిన ఎస్వీయూనివర్శిటీ ఆర్కియాలజీ ప్రొఫెసర్‌ కిరణ్‌క్రాంత్‌చౌదరి పదే పదే చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టడం నిర్లక్ష్యం కాక మరేమిటి? శ్రీకాళహస్తి ఆలయ గోపురాల మీది శిల్పాల మీదా, శాసనాల మీదా ఆయన చేసిన అధ్యయనాన్ని హార్మన్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ 1990లోనే పుస్తకంగా ప్రచురించింది. గోపురాల మీద నెర్రెలు కనిపించినపుడంతా ఆయన ఆందోళనతో ఆలయ అధికారులకూ, దేవాదాయ శాఖకూ రాసిన ఉత్తరాలన్నీ చెత్తబుట్టలపాలయ్యాయి. ఈ నిర్లక్ష్యానికి మూల్యం భారీగానే చెల్లించుకోవలసి వచ్చింది. అయిదు శతాబ్దాల అపురూప నిర్మాణాన్ని కోల్పోవలసి వచ్చింది. కూలకుండా కాపాడలేకపోయాం, కనీసం ఆ శిధిలాల్లో మిగిలిన శిల్ప సంపదనైనా ఏరి దాచుకోలేమా? ఆధునిక భవంతి అవశేషాలను తొలగించినంత తేలికగా ప్రాచీన కట్టడాల శిధిలాలు తొలగించరాదని ఆర్కియాలజీ నిపుణులు చెవినిల్లు కట్టుకుని పోరుతున్నా ఎవరికీ పట్టకపోవడం అన్యాయం. జెసిబిలతో, ప్రొక్లెయిన్లతో, హిటాచీలతో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన విజయ స్థూప శిధిలాలను తొలగించడానికి పూనుకోవడాన్ని ఏమనాలి? ఎలా అర్ధం చేసుకోవాలి? పైగా ఇంత కన్నా గొప్ప గోపురాన్నే, కూలిన చోటే రెండేళ్ళలో నిర్మిస్తామని దిలాసాగా చెబుతున్నారు మన మంత్రులూ, దేవాదాయ శాఖ అధికారులూ. కూలిన గోపురం విలువ తెలియక ఆడే మాటలే ఇవి. ఒక తాజ్‌ మహల్‌నీ, ఒక చార్మినార్‌నీ మనం తిరిగి నిర్మించగలమా? ఇదీ అంతే. కాకుంటే కష్టపడితే ఒక నకిలీని తయారు చేయగలం. అసలును అపురూపంగా కాపాడుకోవాలనే స్పృహ లేని అధికారులూ నాయకులూ ఉన్న రాజ్యంలో గోపురాలు కూలుతూనే ఉంటాయి. ఆలయాలను సంస్కృతీ చిహ్నాలుగా గాక ఆదాయ వనరులుగా భావించే ఆధునిక కాలంలో ప్రాచీనతకు ప్రాధాన్యం లభిస్తుందనుకోవడం అత్యాశే అవుతుందేమో. కూలింది ప్రస్తుతం శ్రీకాళహస్తి గోపురమే కావచ్చు, కూలడానికి మన రాష్ట్రంలో మరెన్ని సిద్ధంగా ఉన్నాయి? కనీసం వీటినైనా కాపుడుకోగలమా? ఇందుకోసం ఒక ప్రయత్నాన్ని శ్రీకాళహస్తి సాక్షిగా అయినా ప్రారంభించకపోతే చరిత్ర మనల్ని ఎన్నటికీ క్షమించదు. ఇందుకోసం మన ప్రభువులకు కావలసింది ప్రాచీన స్పృహ. పురా సంపదను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి. ఈ రెండూ ఉంటే, అయిదు వందల యేళ్ళే కాదు పదిహేను వందల యేళ్ళ కిందటి నిర్మాణాలను కూడా పదిలంగా కాపాడుకోగలం. అలంపూర్‌ లో ఆలయాలనే చెక్కుచెదరకుండా మరో చోటికి మార్చిన వాళ్ళకు ఉన్న గోపురాలను రక్షించుకోవడం అసాధ్యం కాబోదు.
(ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ప్రచురితం అయిన ఎడిటోరియల్)

About maavooru

journalist,shortstory writer
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

వ్యాఖ్యానించండి